: రేవాను బ్రేకులు... హెలికాప్టర్ ను వదిలి కారెక్కిన చంద్రబాబు!
రాయలసీమ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ‘రేవాను’ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. నిన్న మధ్యాహ్నం కర్నూలు నుంచి కడపకు బయలుదేరే సమయంలో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ ను వదిలిన చంద్రబాబు కారులో వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి కడప జిల్లా గండికోటలో బస చేసిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లాకు బయలుదేరారు. రేవాను తుఫాను కారణంగా ప్రస్తుతం కడప జిల్లా సరిహద్దు జిల్లాలు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ ప్రభావం కడప జిల్లాపైనా పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గండికోట నుంచి అనంతపురానికి హెలికాప్టర్ ప్రయాణం కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. అధికారుల సూచనతో హెలికాప్టర్ ఎక్కాల్సిన చంద్రబాబు తన మనసు మార్చుకుని కారెక్కేశారు. రోడ్డు మార్గం మీదుగా ఆయన అనంతపురం జిల్లాకు బయలుదేరారు.