: వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు చుక్కలు చూపిన గిరిజనులు...అడవిలో 5 కి.మీ మేర నడిపించిన వైనం
విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న గిరిజనులకు మద్దతుగా నిలబడదామని వెళ్లిన వైసీపీ నేతలకు నిన్న చేదు అనుభవం ఎదురైంది. తమకు మద్దతుగా వచ్చిన వైసీపీ నేతలకు ఘన స్వాగతం పలకాల్సిన గిరిజనులు అందుకు విరుద్ధంగా వారితో ఏకంగా మార్చ్ ఫాస్ట్ చేయించారు. చేతుల్లో విల్లంబులు పట్టి వాహనాలు ఎక్కేందుకు వీలు లేదంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నేతలు కాలిబాట పట్టక తప్పలేదు. ముందు కొంతమంది, వెనుక కొంతమంది, ఇరు పక్కల్లో ఇంకొందరు విల్లంబులు చేతబట్టి నడవడంతో వైసీపీ నేతలు బిక్కచచ్చిపోయారు. అసలు విషయమేంటంటే... విశాఖలో బాక్సైట్ గనుల తవ్వకానికి ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనులు ఉద్యమ బాట పట్టారు. గిరిజనులకు మద్దతుగా నిలుద్దామని వైసీపీ నేత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ కార్యకర్తలతో కలిసి నిన్న జర్రెలకు వెళ్లారు. నిన్న ఉదయం 11 గంటలకే అక్కడికి చేరుకున్న ఈశ్వరి, అమర్ లు గ్రామస్థులు వచ్చేలోగా బాక్సైట్ కొండలను పరిశీలిద్దామని భావించి బోడమ్మ బీడింగ్ కు బయలుదేరారు. జర్రెల నుంచి బోడమ్మ బీడింగ్ కు 8 కిలో మీటర్ల దూరం ఉంటుంది. జర్రెల నుంచి కార్లలోనే బయలుదేరిన ఈశ్వరి, అమర్ లు 3 కిలోమీటర్లు ప్రయాణించి మొండిగడ్డకు చేరుకున్నారు. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల మేర కాలినడకన బోడమ్మ బీడింగ్ కు చేరుకున్నారు. అయితే కాస్త ఆలస్యంగా జర్రెల వచ్చిన గిరిజనులు, వైసీపీ నేతలు కొండ ఎక్కిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా కొండ ఎలా ఎక్కుతారంటూ ఆగ్రహించిన గిరిజనం విల్లంబులు చేతబట్టి బోడమ్మ బీడింగ్ కు భారీ సంఖ్యలో బయలుదేరింది. వైసీపీ నేతల వెంట బాక్సైట్ కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చారని భావించిన గిరిజనులు రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికివేసి మరీ బయలుదేరారు. కొండ మీదకు చేరకముందే వారికి వైసీపీ నేతలు ఎదురయ్యారు. తమకు చెప్పకుండా కొండ ఎందుకు ఎక్కారంటూ వైసీపీ నేతలను నిలదీశారు. అంతేకాక ‘‘జగన్ కు పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాపరెడ్డి మేనమామ అవుతారు. ప్రతాపరెడ్డికి బాక్సైట్ కంపెనీ ‘ఆన్ రాక్’ కంపెనీలో వాటా ఉంది. వైసీపీ నేతలు బాక్సైట్ కొండను సందర్శించాలన్నా, బాక్సైట్ కు వ్యతిరేకంగా పోరాడాలన్నా ముందు ఆన్ రాక్ ను మూసివేయాలి. వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలి’’అని గిరిజనులు తేల్చిచెప్పారు. జర్రెల వెళ్లి మాట్లాడుకుందామని గిరిజనానికి సర్ది చెప్పిన వైసీపీ నేతలు అప్పటికే అక్కడికి చేరుకున్న తమ వాహనాలను ఎక్కబోయారు. అయితే వైసీపీ నేతలను అడ్డుకున్న గిరిజనం తమతోపాటు జర్రెల దాకా నడవాల్సిందేనని తేల్చిచెప్పారు. అసలే విల్లంబులు చేతబట్టి వచ్చిన గిరిజనులకు ఎదురు చెప్పే ధైర్యం చాలక వైసీపీ నేతలు కాళ్లకు పనిచెప్పక తప్పలేదు. అక్కడి నుంచి దాదాపు 5 కిలోమీటర్ల మేర వారు గిరిజనులతో కలిసి కాలి నడకనే జర్రెల చేరుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడ గిరిజనులతో మాట్లాడి వారు కాళ్ల నొప్పులతోనే కార్లలో బయలుదేరారు.