: బాబు ఎప్పుడు పిలిచినా చర్చకు సిద్ధం: మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ప్రతి సవాలు
రాయలసీమకు అన్యాయం జరిగిందని భావించే వారు బహిరంగ చర్చకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను స్వీకరిస్తున్నానని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు, ఎక్కడికి పిలిచినా చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. చంద్రబాబు విధానాలవల్ల రాయలసీమ ఉనికికే ఇబ్బందిగా మారిందని ఆయన పేర్కొన్నారు. అధికారం చేపట్టిన తరువాత 25 సార్లు పర్యటించినా చంద్రబాబు న్యాయం చేయలేకపోయారని ఆయన విమర్శించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబును ప్రశ్నించలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.