: ఆర్టీసీలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం: ఏపీ మంత్రి శిద్దా
ఆర్టీసీలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 12 నుంచి ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లు ధరించాలన్నారు. ఆర్టీసీకి త్వరలో వెయ్యి కొత్త బస్సులు రానున్నట్లు ఆయన చెప్పారు. అన్ని ప్రధాన బస్టాండ్ల సుందరీకరణ, ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, ప్రజల్లో అవగాహన కల్పించాకే హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తామని సుమారు తొమ్మిదిరోజుల క్రితం మంత్రి శిద్దా అన్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ వాడకం గురించి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.