: జీహెచ్ఎంసీలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కేసీఆర్ ఆదేశం
కొన్ని నెలల కిందట సమ్మె సమయంలో కొంతమంది జీహెచ్ఎంసీ కార్మికులను ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా వారందరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ ఎంసీ ఉద్యోగులు చేస్తున్న కృషిని సీఎం అభినందించారు. రంజాన్, బోనాల పండగ సమయంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులను కొందరు కవ్వించి సమ్మె నోటీసు ఇప్పించేలా చేశారన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించినా తనకు ఉద్యోగుల పట్ల కోపం లేదని చెప్పారు. అందుకే అప్పట్లో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తున్నానన్నారు. ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలన్నారు. నగరంలోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో, గ్రేటర్ హైదరాబాద్ లో చెత్త సేకరణ కోసం ఆటో ట్రాలీలకు సీఎం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 1005 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. అదేవిధంగా చెత్త సేకరణకు ఇంటింటికీ పొడి చెత్త, తడి చెత్త సేకరణ కోసం నీలీ రంగు, ఆకు పచ్చ రంగు బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ ను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఆటోలు వచ్చినా చెత్త మిగిలే ఉందంటూ నెగటివ్ వార్తలు రాయొద్దని మీడియా ప్రతినిధులను ఆయన కోరారు. నెలాఖరుకు ఆటోలు, చెత్తడబ్బాల పంపిణీ పూర్తి చేస్తామన్నారు.