: 'సామ్నా' సంపాదకీయంలో బీజేపీపై విమర్శలు... నితీశ్ కు ప్రశంసలు


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన భారతీయ జనతా పార్టీపై శివసేన విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే అదునుగా భావించి పలు రూపాల్లో బీజేపీని దుయ్యబడుతోంది. అటు బీహార్ హీరోగా ఆవిర్భవించిన నితీశ్ కుమార్ ను ప్రశంసలతో ముంచెత్తింది. తాజాగా సేన పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో, అసెంబ్లీ ఎన్నికల్లో కమలానికి ఎదురైన ఘోర పరాజయాన్ని పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను తేలిగ్గా తీసుకున్న బీజేపీ, బీహార్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుందని పేర్కొంది. 'మోదీ వర్సెస్ నితీశ్'గా ముఖాముఖి పోరు జరిగిందని తెలిపింది. రాజకీయ వ్యూహాలు, డబ్బు, భారీ ప్యాకేజీ ప్రకటనలు చేసినా బీజేపీ 60 సీట్లు కూడా సాధించలేకపోయిందని సేన ఎద్దేవా చేసింది. దాంతో ఎన్డీఏ మిత్రపక్షాలను బీహార్ ఓటర్లు 20 అడుగుల లోతు గోయ్యిలో పాతిపెట్టారని వ్యాఖ్యానించింది. ఇక నిరాడంబర ప్రచారం, నిజాయతీ ఇమేజ్ తో నితీశ్ అధికారం నిలబెట్టుకున్నారని తెలిపింది. ఎలాంటి బూటకపు హామీలు ఇవ్వలేదని, అనాగరిక భాష వాడలేదని, డబ్బు, అధికారం వినియోగించలేదని, ఇవన్నీ నితీశ్ విజయానికి బాటలు వేశాయని సేన ప్రశంసించింది. అయితే మహాకూటమి గెలిచాక పాకిస్థాన్ లో టపాసులు పేలాయో లేదో తమకు తెలియదంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను సంపాదకీయంలో శివసేన ప్రస్తావించింది. మొత్తానికి బీహార్ ఎన్నికల ఫలితాలు కాషాయం పార్టీకి కచ్చితంగా ఎదురుదెబ్బేనని పేర్కొంది.

  • Loading...

More Telugu News