: ప్రపంచాన్ని భయపెడుతున్న 'పాక్ పీడకల'!


మరో పదేళ్లలో అత్యధిక అణ్వాయుధాలు నిల్వ చేసుకున్న టాప్-3 దేశంగా పాకిస్థాన్ నిలిచి, ప్రపంచానికి ప్రమాదకరంగా తయారు కానుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే 120 వార్ హెడ్స్ ఆ దేశంలో ఉన్నాయని, 2025 నాటికి అణ్వాయుధాల విషయంలో చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ లను పాకిస్థాన్ అధిగమించనుందని, ఆ సమయానికి ఇండియాలోని అన్ని ప్రాంతాలను, అంతకు మించిన సుదూర లక్ష్యాలను పాక్ అణ్వాయుధాలు చేరుకునేలా ఉంటాయని, ఈ విషయం ప్రపంచానికి పీడకలేనని 'న్యూయార్క్ టైమ్స్' తన సంపాదకీయంలో అభిప్రాయపడింది. ఇప్పటికే తీవ్రవాదుల సంఖ్య అధికంగా ఉన్న ఆ దేశంలో అణ్వాయుధాలు వారి చేతికి చేరితే మరింత ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ దేశాలు ఒత్తిడి చేస్తున్నా, పాకిస్థాన్ అణు కార్యక్రమాల విషయంలో ముందుకే వెళుతోందని ఆరోపించింది. 1998లో ఇండియాను అనుకరిస్తూ, పాకిస్థాన్ అణు పరీక్షల తరువాత ఆ దేశంపై ఎన్నో ఆంక్షలు అమలయ్యాయని, ఆపై అవి ఒక్కొక్కటిగా తొలగుతుండగా, అంతే స్థాయిలో పాక్ పుంజుకుంటోందని తెలిపింది. భద్రతా విషయాలపై పాకిస్థాన్ తో శాంతి ఒప్పందాల దిశగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క అడుగు కూడా వేయలేకపోయారని తెలిపింది. ఇండియాతో ఎంత మంచి సత్సంబంధాలుంటే, అంతగా అణ్వాయుధాల తయారీలో పాక్ నిదానించవచ్చని భావిస్తున్నట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News