: శ్రీని ఔట్!... ఐసీసీ కొత్త చైర్మన్ గా బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్
అంతా అనుకున్నట్టే అయ్యింది. ఐసీసీ చైర్మన్ పదవి నుంచి బీసీసీఐ మాజీ చీఫ్, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ దిగిపోయారు. శ్రీని స్థానంలో బీసీసీఐ కొత్త చీఫ్ శశాంక్ మనోహర్ సరికొత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ చీఫ్ హోదాలోనే శ్రీని ఐసీసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ చీఫ్ పదవి నుంచి దిగిపోయిన శ్రీని, ఐసీసీ పీఠంపై నుంచి మాత్రం దిగేందుకు ససేమిరా అన్నారు. అంతేకాక బీసీసీఐలో ప్రాతినిధ్యం లేకున్నా, ఐసీసీ చైర్మన్ పదవిలో శ్రీని కొనసాగుతున్నారు. దీంతో దీనిపై దృష్టి సారించిన శశాంక్ మనోహర్ కొద్దిసేపటి క్రితం ముంబైలో మొదలైన బీసీసీఐ ఏజీఎంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐలో ప్రాతినిధ్యం లేని శ్రీనిని ఐసీసీ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఏజీఎం ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతేకాక ఐసీసీ చైర్మన్ గా శశాంక్ పేరును నామినేట్ చేస్తూ ఏజీఎం సభ్యులు తీర్మానించారు. బీసీసీఐ నిర్ణయంతో శ్రీని ఇక క్రికెట్ కు దాదాపుగా దూరమైనట్టేనని చెప్పొచ్చు.