: ముఖంలో ఏదో దిగులు... వాడి కూడా తగ్గిన మోదీ ప్రసంగం!
బీహార్ లో ఓటమి ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఈ ఉదయం ఢిల్లీలో జరుగుతున్న న్యాయసేవ సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఎప్పుడు, ఎక్కడ ప్రసంగించినా, వాడి వేడి మాటలు నిండివుండే మోదీ ప్రసంగం, ఈ దఫా చప్పగా సాగింది. ఆయన ముఖంలో ఓటమి తాలూకు నైరాశ్యం దాగున్నట్టు స్పష్టంగా కనిపించింది. కాగా, భారతీయులు లోక్ అదాలత్ లను మరింతగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న లక్షలాది కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. లోక్ అదాలత్ లపై ప్రజల్లో మరింతగా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్న మోదీ, అందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చర్చించడం ద్వారా పేదలకు న్యాయం దగ్గరవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ దేశంలో లోక్ అదాలత్ ల ద్వారా ఎనిమిదిన్నర కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి ఫలాలతో పాటు ప్రజలందరికీ సత్వర న్యాయసేవలు దగ్గరైనప్పుడే దేశం ముందుకెళుతుందని అన్నారు.