: ఆ 'తుత్తి' దూరమై రెండేళ్లు!
'నాకదో తుత్తి' అంటూ మిస్టర్ పెళ్లాం చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల ఇళ్లలోకి వచ్చేసిన ఏవీఎస్ (ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం) కానరాని లోకాలకు వెళ్లి రెండేళ్లు దాటింది. తనదైన స్టయిల్లో వంకర తిరిగిన కుడిచేతిని ఊపుతూ నవ్వించినా, తెనాలి నుంచి కాశీకి వచ్చిన అమాయక వ్యక్తి పాత్రలో జీవించినా, మూతి వంకరగా పెట్టి ఇబ్బందిపెట్టే ప్రశ్నలను వరుసగా సంధిస్తూ, 'గోడపై బల్లి కనిపించిందా? గాలి కనిపించిందా?' అంటూ బ్రహ్మానందంతో కలసి హాస్యం పండించినా అది ఏవీఎస్ కే చెల్లింది. 56 సంవత్సరాల వయసులో అనారోగ్యం కారణంగా ఆయన నవంబర్ 8, 2013న మరణించిన సంగతి తెలిసిందే. 19 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఏవీఎస్ 'సూపర్ హీరోస్' చిత్రంతో దర్శకుడిగాను, 'అంకుల్' సినిమాతో నిర్మాతగానూ తనలోని మరో ప్రతిభను కూడా చూపించారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు జనరల్ సెక్రటరీగా మూడు సార్లు ఎంపికయ్యారు. పలు నంది పురస్కారాలనూ అందుకున్నారు. తెలుగు సినిమా హాస్యంపై ఆయనది చెరగిపోని ముద్ర!