: ఒకే ఒక్కడు!... నాడు మోదీని గెలిపించాడు, నేడు నితీశ్ ను నిలబెట్టాడు!
2012లో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ వరుస విజయం సాధించడమే కాక, 2014లో దేశ ప్రధానిగానూ అద్భుత విజయం సాధించడంలో ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. తాజాగా బీహార్ లో నితీశ్ కుమార్ వరుసగా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు కూడా ఆయనే కారకుడయ్యారు. ఆయనే ఉన్నత విద్యావంతుడు, ఆఫ్రికాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధిగా 2011దాకా పనిచేసిన ప్రశాంత్ కిషోర్. 37 ఏళ్ల వయసున్న ప్రశాంత్ అప్పటిదాకా ఐరాసలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి 2011లో స్వదేశం చేరారు. ఆ తర్వాత ఎంబీఏ, ఐఐటీ గ్యాడ్యుయేట్స్ తో ఓ పటిష్టమైన జట్టును ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ దేశంలో ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తించిన ప్రశాంత్ ‘చాయ్ పే చర్చా’ పేరిట వినూత్న ప్రచారానికి తెర తీశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘చాయ్ పే చర్చా’ దేశవ్యాప్తంగా ఓటర్లను ఆకట్టుకుంది. బీజేపీకి ఓట్లను రాల్చింది. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కేందుకు ప్రధాన భూమిక పోషించింది. బీహార్ లోని బక్సర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ తాజాగా నితీశ్ కుమార్ కు అండగా నిలిచారు. మహా కూటమి ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. నితీశ్ పదేళ్ల పాలనపై సమీక్ష చేద్దామంటూ ఆయన తెరపైకి తెచ్చిన ‘పర్చా పే చర్చా’ బీహారీలను బాగా ఆకట్టుకుంది. ఫలితంగా బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ కూటమికి షాకిచ్చిన బీహారీ ఓటర్లు అప్పటికే పదేళ్ల పాటు సీఎంగా పనిచేస్తున్న నితీశ్ కే పట్టం కట్టారు.