: ఈ విజయం... బీహారీల ఆత్మగౌరవానికి నిదర్శనం!: నితీష్ కుమార్
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన మహాకూటమి అధినేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేడీ(యు) అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లు పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘బీహార్ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ విజయం. ఇది ప్రజా విజయం. ఎలాంటి ప్రభుత్వం తమకు కావాలో బీహార్ ప్రజలు స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఈ విజయం కూటమిలోని ప్రతిఒక్కరిదీ. దళితులు, మహాదళితులు, ఓబీసీలు, ఎంబీసీలు ప్రతి ఒక్కరూ అండగా నిలిచారు. ప్రచారంలో అన్ని అంశాలను పరిశీలించిన ప్రజలు వివేకవంతమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన విజయాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తాము. జేడీ యు), ఆర్జేడీ, కాంగ్రెస్ ల మహాకూటమిని ప్రజలు ఆమోదించారు. ఈ ఎన్నికలను కేవలం బీహార్ వరకే చూడకూడదు. బలమైన ప్రత్యామ్నాయ అవసరాన్ని ఈ ఎన్నికలు ధ్రువపరుస్తున్నాయి. ఎన్నికల తర్వాత ప్రతిపక్షంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. బీహార్ సమస్యలపై ప్రతిపక్షంతో కలిసి సర్వసమ్మతితో పరిష్కారాలు కనుగొంటాం. ప్రతిపక్షాన్ని చులకన చేసే పని మేం ఎప్పటికీ చేయం’ అని నితిశ్ కుమార్ పేర్కొన్నారు.