: ఇది ప్రజాస్వామ్య విజయం... నితీశ్ విజయంపై బీజేపీ నేత శత్రుఘ్ను సిన్హా సంచలన వ్యాఖ్య
అసలే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనుకబడింది. ఓ వైపు మహా కూటమి అభ్యర్థులు విజయదుందుభి మోగిస్తుంటే, బీజేపీ అభ్యర్థులు మాత్రం నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. కడపటి వార్తలందే సమయానికి 21 స్థానాల లెక్కింపు పూర్తి కాగా 20 స్థానాలను మహా కూటమి ఎగరేసుకుపోయింది. ఒకే ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మిత్రపక్షం శివసేన నుంచి ఘాటు విమర్శలను ఎదుర్కొన్న బీజేపీకి తాజాగా తన సొంత పార్టీ నేత శత్రుఘ్ను సిన్హా మరో షాకిచ్చారు. బీహార్ లో మహా కూటమికి దక్కనున్న విజయం ప్రజా విజయమని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. అంతేకాక మహా కూటమికి చేజిక్కనున్న విజయం ప్రజాస్వామ్య విజయమని ప్రకటించి ఆయన బీజేపీ నేతలను ఇరకాటంలో పడేశారు. అంతటితో ఆగని ఆయన బిహారీ, బహారీ అన్న పదాలకు బీహార్ ఓటర్లు సరైన తీర్పు ఇచ్చారని కూడా వ్యాఖ్యానించారు.