: 12 నిమిషాల టైం ఇస్తే...రెండు నిమిషాల్లో ముగించేశాడు...విజేందర్!
భారతజాతీయ జట్టును వీడి ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన విజేందర్ సింగ్ తొలి మ్యాచ్ కంటే అత్యుత్తమమైన సాంకేతికతతో రెండో బౌట్ ను గెలుచుకున్నాడు. గత మేలో ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన డీన్ గెలియన్ వరుసగా రెండు బౌట్లు గెలిచి వీజేందర్ కు పోటీగా నిలిచాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో గత నెల నడక ప్రారంభించిన విజేందర్ గెలియన్ ను గెలవగలడా? అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేశారు. మ్యాచ్ కు ముందు విజేందర్ ట్రాక్ రికార్డు గురించి విన్న గిలియన్ మాట్లాడుతూ, 'ప్రత్యర్థి ఎవరైతే ఏంటి? నేను గెలవడానికి వచ్చా'నని చెప్పాడు. ఇంతలో విజేందర్ వచ్చి అభిమానులను విష్ చేశాడు. అనంతరం నాలుగు రౌండ్ల బౌట్ ప్రారంభమవుతుందని, ఒక్కో రౌండ్ మూడు నిమిషాలు సాగుతుందని, మొత్తం బౌట్ 12 నిమిషాలు ఉంటుందని రిఫరీ ప్రకటించాడు. అనంతరం బౌట్ ప్రారంభమైంది. గిలియన్ డిఫెన్సివ్ గేమ్ ను అనుసరించగా, విజేందర్ దూకుడును ఎంచుకున్నాడు. ఎడమ చేతితో రెచ్చగొడుతూ, కుడిచేతితో పంచ్ లిచ్చిన విధానం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. దీంతో మ్యాచ్ మొదలైందని అనుకునేంతలోనే విజేందర్ ముగించేశాడు. కేవలం రెండే రెండు నిమిషాల్లో 15 పంచ్ లు సంధించిన విజేందర్ సింగ్, గిలియన్ ను నాకౌట్ చేసేశాడు. విజేందర్ కొట్టిన పంచ్ లకు గిలియన్ గిలగిల్లాడాడు. విజేందర్ పంచ్ ల ధాటి తట్టుకోలేక తొలి రౌండ్ రెండో నిమిషంలోనే చేతులెత్తేశాడు. దీంతో రెండో మ్యాచ్ ను విజయవంతంగా ముగించాడు.