: మాది స్నేహగీతం... మీది పోరుబాట: టీ టీడీపీకి చంద్రబాబు హితోపదేశం
తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే!... తెలుగు పల్లె సీమల్లో పాప్యులర్ సామెత ఇది. ఈ సామెత తరహాలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న టీ టీడీపీ నేతలకు హితోపదేశం చేశారు. తెలుగు రాష్ట్రాలుగా ఏపీ, తెలంగాణ పరస్పరం సహకరించుకోవాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కారుతో దోస్తీ చేయక తప్పదని ఆయన చెప్పారు. అదే సమయంలో తెలంగాణలో విపక్ష స్థానంలో ఉన్న టీ టీడీపీ అధికార పార్టీ టీఆర్ఎస్ పై పోరు బాట సాగించాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. నిన్న టీ టీడీపీ నేతలతో జరిగిన భేటీ సందర్భంగా చంద్రబాబు ఈ కొత్త వ్యూహాన్ని పార్టీ నేతలకు నిర్దేశించారు. అంతేకాక టీ టీడీపీ కమిటీలో మార్పు చేర్పులకు సంబంధించి ఆ శాఖ నేతలకు పూర్తి స్థాయి అధికారం ఇస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీఆర్ఎస్ తెలంగాణలో అధికారం చేపట్టగా, ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తెలంగాణలో టీ టీడీపీ ప్రతిపక్ష స్థానంలో అధికార పార్టీతో సిగపట్లకు దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేతగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. వాటిని తిప్పి కొట్టే క్రమంలో టీడీపీ కూడా ఘాటు వ్యాఖ్యలకు దిగాల్సి వచ్చింది. ఇక ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ లు ఇరు పార్టీల మధ్యే కాక రెండు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చాయి. అయితే నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనను పురస్కరించుకుని చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య మళ్లీ సుహృద్భావ వాతావరణం నెలకొంది. ఇకపై తగవులాడుకోవడం ఇరు రాష్ట్రాలకు నష్టమేనని వారిద్దరూ దాదాపుగా ఓ అంచనాకు వచ్చారు. మరి ప్రతిపక్ష స్థానంలో ఉన్న టీ టీడీపీ వ్యూహం ఎలా ఉండాలనే అంశంపై ఆ శాఖ నేతలు డోలాయమానంలో పడిపోయారు. నేతల్లోని అయోమయాన్ని తొలగిస్తూ నిన్న చంద్రబాబు ఈ కొత్త మంత్రాన్ని ఉద్బోధించారు.