: ఇదేం పిచ్?... ఆశ్చర్యపోయిన సఫారీలు!


టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే సౌతాఫ్రికా ఆటగాళ్లు పిచ్ మారుతుందని గుర్తించారు. అయితే ఇంత దారుణమైన పిచ్ ను మాత్రం వారు ఊహించలేదు. భారత జట్టు తనకు ఎంతో అచ్చొచ్చిన స్పిన్ ఆధారిత పిచ్ ను తయారు చేస్తుందని అంచనా వేసిన సౌతాఫ్రికా జట్టు, ఫాంలో ఉన్న డుమినిని పక్కన పెట్టి హార్మర్ ను తీసుకుంది. అవసరానికి పనికొస్తాడని వాన్ జిల్ కు కూడా స్థానం కల్పించింది. అయితే బ్యాటింగ్ విభాగంలో ఎంతో బలమైన లైనప్ కలిగిన ప్రోటీస్ టెస్టును డ్రా చేద్దామని భావించారు. ఆ దిశగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. క్రీజులో దిగిన అనంతరం సఫారీలకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. తొలుత టీమిండియా వికెట్లు వడివడిగా పడుతున్నప్పుడు సంబరపడ్డ సఫారీలు, తనదాకా వస్తే కానీ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయారు. తొలి రోజు బౌలింగ్ ముగిసిన అనంతరం ఎల్గర్ మాట్లాడుతూ, 'ఇది డెడ్ పిచ్' అన్నాడు. భారత్ ఇలాంటి పిచ్ తయారు చేస్తుందని ఊహించలేదని పేర్కొన్నాడు. రెండో రోజు బ్యాటింగ్ ముగిసిన అనంతరం ఆమ్లా, డివిలియర్స్ కూడా అదే భావం వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజుల్లో మ్యాచ్ ముగియడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయం కోసం ఇంత దారుణమైన పిచ్ ను తయారు చేయాలా? అంటూ విమర్శలు చేస్తున్నారు. ఒకేరోజు సుమారు 18 వికెట్లు రాలిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. విజయ దాహంతో ఆటలో మజాను చంపేస్తున్నారని, టెస్టు క్రికెట్ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడుతున్నారు. తొలి టెస్టు కంటే మెరుగైన పిచ్ ను మిగిలిన రెండు టెస్టుల కోసం తయారు చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

  • Loading...

More Telugu News