: భారత్ గెలిచింది ...మూడు రోజుల్లోనే ముగిసిన పోరు
తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. ట్వీట్వంటీ, వన్డే సిరీస్ లో ఓటమిపాలైన భారత జట్టు టెస్టుల్లో అయినా గెలుస్తుందా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత జట్టు 108 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రాణించడంతో తొలి టెస్టులో టీమిండియా తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 201 పరుగులకే అలౌట్ అయింది. అనంతం తొలి ఇన్నింగ్స్ ఆడిన సఫారీలు కేవలం 184 పరుగులకే పెవిలియన్ చేరి, భారత్ కు 17 పరుగుల ఆధిక్యం ఇచ్చారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు టాప్ ఆర్డర్ రాణించడంతో అత్యంత క్లిష్టమైన పిచ్ పై 200 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సఫారీలను భారత స్పిన్నర్లు తిప్పేశారు. కేవలం 109 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేసి సత్తా చాటారు. సఫారీ బ్యాట్స్ మన్ లో కేవలం ముగ్గురు ఆటగాళ్లే రెండంకెల స్కోరు చేయగలిగారంటే భారత స్పిన్నర్లు ఏ స్థాయిలో బౌలింగ్ చేశారో ఊహించవచ్చు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లతో రాణించగా, రెండో ఇన్నింగ్స్ లో ఆ ఫీట్ ను రవీంద్ర జడేజా సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా 3 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 3 వికెట్లు తీయడం విశేషం. దీంతో రెండో ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ ను దారుణంగా దెబ్బతీసిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.