: విమాన టికెట్లలో ధమాకా సేల్స్ 'ఆఫర్స్' కాలం ఇక ముగిసినట్టే!
ఇండియాలో వివిధ నగరాల మధ్య విమానాల్లో ప్రయాణించేవారితో పాటు, విదేశీ ప్రయాణికులు జనవరి 2016 నుంచి తమ తమ విమాన టికెట్లపై మరింత డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త ఏవియేషన్ పాలసీ అమలైతే విమాన టికెట్లపై 2 శాతం లెవీ పడనుంది. చిన్న చిన్న పట్టణాల మధ్య విమానాల కనెక్టివిటీ పెంచాలని భావిస్తున్న మోదీ ప్రభుత్వం టికెట్ ధరలపై సుంకాలను పెంచి సాలీనా రూ. 1,500 కోట్లను ఖజానాకు చేర్చాలని భావిస్తోంది. ఈ నిధులతో చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్నది మోదీ ఆలోచన. సవరించిన జాతీయ విమానయాన విధానానికి క్యాబినెట్ ఆమోదం పలికితే, తక్కువ ధర ప్రయాణాలు, ఆఫర్లు తగ్గుతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ 1 నుంచి గంట పాటు గాల్లో ఎగిరే విమానంలో గరిష్ఠంగా టికెట్ ధర రూ. 2,500గా ఉండాలని ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్న సంగతి తెలిసిందే. దీని వల్ల మధ్యతరగతి ప్రజలకు విమానాలు దగ్గరవుతాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.