: కాశ్మీరాన మోదీకి 'నల్ల బెలూన్ల స్వాగతం'!
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పర్యటన నిమిత్తం శ్రీనగర్ కు చేరుకున్న వేళ ఎమ్మెల్యే రషీద్ నేతృత్వంలో వందలాది మంది యువత ఆయనకు నల్ల బెలూన్లను ఎగరేసి నిరసన తెలిపారు. మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన వేదికకు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు రషీద్ ను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన రషీద్ ఇటీవల బీఫ్ పార్టీ ఇవ్వగా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయనపై ఢిల్లీలో ఇంకు దాడి కూడా జరిగింది. దానికి వ్యతిరేకంగానే మోదీ పర్యటనను తాము వ్యతిరేకిస్తున్నామని, దాన్ని అడ్డుకుంటామని రషీద్ ముందుగానే హెచ్చరించారు. కాగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా, మధ్యాహ్నం 2 గంటల వరకూ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపారు.