: పెవిలియన్ కు వెళ్లేందుకు పోటీ... పేక మేడలా కుప్పకూలిన భారత్!
కాస్తంత కుదురుగా ఆడి కనీసం 300 పరుగుల లీడ్ చూపిస్తే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్న తరుణంలో మరోసారి భారత మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. ఓవర్ నైట్ స్కోరు 125/2తో నేటి ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన జట్టులో పుజారా 77 మినహా మరెవరూ రాణించలేదు. కెప్టెన్ కోహ్లి 29 పరుగులకు అవుట్ అయిన తదుపరి భారత బ్యాట్స్ మన్లు పెవిలియన్ కు వెళ్లేందుకు పోటీ పడ్డారు. ఆదుకుంటాడనుకున్న రహానే 2 పరుగులు, రవీంద్ర జడేజా 8 పరుగులు, మిశ్రా 2 పరుగులు, అశ్విన్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం సాహా 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు. లంచ్ విరామ సమయానికి ఇండియా స్కోరు 69.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు. సాహాతో పాటు బౌలర్లు ఆరోన్, యాదవ్ మాత్రమే మిగిలివుండటంతో ఇక భారత్ భారీ స్కోరు సాధించే అవకాశాలు దాదాపు లేనట్టే!