: డ్రంకెన్ డ్రైవ్ నుంచి తప్పించుకోబోయి బైకర్ దుర్మరణం!
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఓ యువకుడి ప్రాణాలను తీసింది. డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులను తప్పించుకునేందుకు బైకు వేగం పెంచిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ పరిధిలో గత రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు తక్షణం స్పందించి గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. మరోపక్క, గత రాత్రి జరిపిన డ్రంకెన్ డ్రైవ్ లో కారుకు ఎంపీ స్టిక్కర్ తగిలించుకు వచ్చిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడు పరీక్షలకు సహకరించకుండా పోలీసుల సహనాన్ని పరీక్షించాడు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నామని, 8 బైక్ లు, 6 కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.