: నేనో పులిని... నా పంజా రుచి చూస్తారా?: కుష్బూ
తమిళనాట కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నేతల్లో ఒకరిగా ఎదిగిన నటి కుష్బూ, తనను విమర్శిస్తున్న వారిపై నిప్పులు చెరిగారు. తాను పులి లాంటిదాన్నని, రెచ్చగొడితే, పంజా విసురుతానని ఆమె హెచ్చరించారు. ఢిల్లీ స్థాయిలో మంచి పరపతి ఉన్న కుష్బూ, దాన్ని ఉపయోగించే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలంగోవన్ పదవి ఊడిపోకుండా ఆపిందని తెలుస్తోంది. దీంతో పలువురు సీనియర్ మహిళా నేతలు ఆమెపై విమర్శలు గుప్పించారు. కొందరు మహిళా నేతలు చేసిన వ్యాఖ్యలను ఈరోడ్ లో జరిగిన కాంగ్రెస్ మహానాడులో ప్రస్తావించిన కుష్బూ, తీవ్రంగా స్పందించారు. పార్టీని బలపరిచేందుకు శ్రమిస్తున్నందునే ఇలంగోవన్ కు తాను మద్దతుగా నిలిచానని అన్నారు. డీఎంకే నుంచి తాను ఎందుకు బయటకు వచ్చానో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట కాంగ్రెస్ సత్తా చాటుతుందని తెలిపారు.