: పొరపాటున అసలు పేరు చెప్పి ఇరుక్కున్న చోటా రాజన్... అరెస్టు వెనుక అసలు కథ!
దాదాపు 25 సంవత్సరాల నుంచి అతను ఫలానా అని ఎవరికీ తెలియదు. ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జీ. ప్రపంచానికి చోటా రాజన్ గా పరిచయం. మోహన్ కుమార్ అనే పేరుతో దొంగ పాస్ పోర్టు పొంది విదేశాల్లో చక్కర్లు కొడుతుంటాడు. గతవారం ఇండొనేషియా లోని బాలీ విమానాశ్రయంలో చోటా రాజన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన ఓ ఆసక్తికర ఘటనను సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. బాలీ నుంచి ఆస్ట్రేలియా వెళ్లేందుకు రాజన్ క్యూలో నిలుచుని ఉన్నాడట. అప్పటికే ఆస్ట్రేలియా పోలీసుల నుంచి ఓ 55 ఏళ్ల వ్యక్తి మారు పేరుతో తిరుగుతున్నాడని, అతనిపై కొన్ని కేసులు ఉన్నాయని, రెండు దేశాల మధ్యా ప్రయాణిస్తున్నాడని బాలీ అధికారులకు చెప్పివున్నారు. ఈ నేపథ్యంలో బాలీ ఎయిర్ పోర్టు అధికారి ఒకరు రాజన్ వయసు 55 ఏళ్లు ఉంటాయన్న అనుమానంతో, "మీ పేరేంటి?" అని అడుగగా, మోహన్ కుమార్ అని చెప్పాల్సిన రాజన్, పొరపాటున తన అసలు పేరు చెప్పేశాడట. అంతే, ఆ వెంటనే పాస్ పోర్టు తీసుకోవడం, విచారణ, అరెస్టు జరిగిపోయాయి. మోహన్ కుమార్ అని చెప్పి వుంటే, అతన్ని అరెస్ట్ చేసేవారు కాదని, పాస్ పోర్టు పరిశీలించి, ఎన్నో దేశాలు అప్పటికే తిరిగి వున్నందున వ్యాపారి అయివుంటాడని భావించి వదిలేసి ఉండేవారట. ప్రస్తుతం సీబీఐ అధీనంలో ఉన్న రాజన్ నోటి నుంచి ఎన్నో నిజాలను కక్కించే ప్రయత్నంలో భాగంగా అధికారులు విచారిస్తున్నారు.