: అలా గెలిచింది, ఇలా పోగొట్టుకుంది... సెల్ఫీ ఇలా కూడా నష్టపరుస్తుంది!
ఆ యువతి ఓ గుర్రపు పందెంలో దాదాపు రూ. 50 వేలు గెలుచుకుంది. ఆనందంగా ఆ టికెట్ ను చూపిస్తూ సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తరువాత కాసేపటికి డబ్బుల కోసం పందాల నిర్వాహకులను సంప్రదించగా, అప్పటికే ఆ టికెట్ చూపి డబ్బు తీసుకెళ్లారని చెప్పడంతో ఆ అమ్మడు కంగుతింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియాకు చెందిన చాంటెల్లే అనే యువతి 'విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్' అంటూ, తనకు బహుమతిని తెచ్చిపెట్టిన టికెట్ ను అందరికీ కనిపించేలా పోస్టు చేసింది. దాన్ని చూసిన ఆకతాయిలు ఎవరో చక్కా ప్రింట్ తీసుకుని, దానిపైని బార్ కోడ్ చూపించి డబ్బులు తీసుకెళ్లిపోయారు. తన స్నేహితులే ఎవరో ఈ పని చేసి వుంటారని చాంటెల్లే ఇప్పుడు వాపోతోంది. డబ్బులు తీసుకున్న తరువాత ఫోటో పంచుకుంటే బాగుండేదని వాపోతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే కాబోలు!