: వారంతా అటూ ఇటూ కానివారేనట!: రేవంత్ రెడ్డి
తెలంగాణలోని మంత్రులంతా అటూ ఇటూ కానివారేనని స్వయంగా కేసీఆర్, తన కుమార్తె కవితతో చెప్పారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. పటాన్ చెరువులో జరిగిన టీడీపీ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రస్తుత కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో 18 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా, ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. "ఈ విషయంలో ఎంపీ కవిత, మహిళలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని తన తండ్రిని అడిగితే, ఇప్పుడు పదవుల్లో ఉన్న మంత్రులంతా మగవాళ్లలా కనిపిస్తున్నారా? అని కేసీఆర్ ఆమెతో అన్నారట" అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెబితే ఏ ఉద్యోగీ వినే పరిస్థితి కనిపించడం లేదని, ఓ జీహెచ్ఎంసీ ఉద్యోగితో పని చేయించుకునేందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఓ మంత్రికి చెప్పుకోవాల్సి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. కరవు సహాయక చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ సర్కారు తీవ్రంగా విఫలమైందని విమర్శించారు.