: ముంబై పోలీసుల తిక్క కుదిర్చిన ఛోటా రాజన్!
మాఫియా డాన్ ఛోటా రాజన్ ముంబై పోలీసుల తిక్క కుదిర్చాడు. మాఫియాతో ముంబై పోలీసులకు లింకులు ఉన్నాయని, హత్యలు, ఖూనీలు చేసే నరహంతకులను పట్టించుకోని ముంబై పోలీసులు, మామూళ్లకు ఆశపడి అమాయకులను చావబాదుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఛోటా రాజన్ ముంబై పోలీసు అధికారుల్లోని దావూద్ ఇబ్రహీం అనుచరల పేర్లను సీబీఐ అధికారుల ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ఇండోనేసియాలోని బాలిలో ఉండగానే ముంబై వెళ్లేందుకు అంగీకరించని ఛోటా రాజన్ ను ఢిల్లీ తరలించిన సీబీఐ అధికారులు, ముంబై పోలీస్ స్టేషన్లలో అతనిపై ఉన్న కేసుల ఫైళ్లను స్వాధీనం చేసుకుని ఢిల్లీ తరలించి, అక్కడ రహస్య విచారణ ప్రారంభించారు. దీంతో ఈ కేసులపై మాట్లాడిన ఛోటా రాజన్ మాఫియాకు సహకరించే పోలీసు అధికారుల పేర్లను వెల్లడించినట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇదే జరిగితే ముంబై ఖాకీ వ్యవస్థలో మాఫియా ఎలా వేళ్లూనుకుందో అధికారులకు తెలుస్తుందని, దీనితోనైనా ప్రక్షాళన జరిగి, అవినీతి అధికారుల తిక్కకుదురుతుందని అంతా ఆశిస్తున్నారు.