: సౌతాఫ్రికాపై స్పిన్నర్ల చావు దెబ్బ!... 184 పరుగులకే ఆలౌట్
దక్షిణాఫ్రికా జట్టును భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చాపచుట్టేశాడు. కీలకమైన ఆటగాళ్లలో ఐదుగురిని అశ్విన్ అవుట్ చేయడంతో, చావు దెబ్బతిన్న సౌతాఫ్రికా జట్టులోని మిగతా ఆటగాళ్లను జడేజా, మిశ్రాలు పెవీలియన్ దారి పట్టించారు. దీంతో రెండో రోజు ఆటలో టీ విరామానికి ముందే 184 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది. అర్ధ సెంచరీ చేసి చాలా సేపు భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన డివిలియర్స్ 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిశ్రా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. టెయిలెండర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. మొత్తం మీద 17 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆట మరో మూడు రోజులకు పైగానే మిగిలి వుండటంతో ఫలితం ఖాయమని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 300 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగితే, విజయం సాధించే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.