: ఇమ్రాన్ ఖాన్ కు విషం పెట్టి చంపాలని చూసిన మాజీ భార్య రెహాన్?


పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఆ దేశ రాజకీయాల్లో ప్రధాన నేతల్లో ఒకరైన ఇమ్రాన్ ఖాన్ కు, ఆయన మాజీ భార్య రెహాన్ విషం పెట్టి చంపాలని చూసిందా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఓ ప్రత్యేక కథనం అది నిజమేనని అంటోంది. ఆరిఫ్ నిజామీ అనే ఓ పాక్ జర్నలిస్టు ఈ సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాడట. ఇమ్రాన్ ఖాన్ అడ్డు తొలగితే, ఆయన రాజకీయ వారసత్వం తనకు లభిస్తుందన్న కుట్రతో ఆమె ఈ పని చేయబోయిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తొలుత నిఘా వర్గాలు కనుగొన్నాయని పాక్ కు చెందిన 'న్యూస్ 24' చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. "రెహాన్ ప్రవర్తన సరిగ్గా లేదు. ఆమె ఉద్దేశాలు సక్రమంగా లేవు. పార్టీ వారసత్వం కోసం మీకు విషం పెట్టే అవకాశాలు ఉన్నాయి" అని ఇంటెలిజన్స్ వర్గాలు ఖాన్ కు తెలిపాయి. ఆ తరువాత వీరిద్దరిలో విభేదాలు పెరిగాయని, ఇమ్రాన్ గతంలో ఆస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆయన శరీరంలో విష పదార్థం ఉన్నట్టు వైద్యులు గుర్తించారని, ఆ తరువాతనే వీరిద్దరూ విడిపోయారని నిజామీ వ్యాఖ్యానించారు. కాగా, అక్టోబర్ 30న తమ బంధాన్ని తెంచుకున్నట్టు ప్రకటించిన ఇమ్రాన్, రెహామ్ లు అందుకు కారణాన్ని వెల్లడించని సంగతి తెలిసిందే. దీంతో ఈ కథనం నిజం కావచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News