: తమిళనాట ఎస్సై కాబోతున్న హిజ్రా... పోస్టింగ్ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశం


తమిళనాడు రాష్ట్రంలో ప్రితికా యాస్ని అనే హిజ్రా అనుకున్నది సాధించింది. కోర్టును ఆశ్రయించి తన కల నెరవేర్చుకుంది. ప్రితికాకు రాష్ట్ర పోలీస్ శాఖలో ఎస్సైగా పోస్టింగ్ ఇవ్వాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే... తమిళనాడు పోలీస్ యూనిఫాం రిక్రూట్ మెంట్ బోర్డు నేతృత్వంలో ఇటీవల రాత పరీక్షలు జరిగాయి. ఇందుకు ప్రితికా దరఖాస్తు చేసుకుంది. అందులో మూడో కేటగిరీకి సంబంధించిన వివరాలు లేకపోవడంతో స్త్రీగా పేర్కొన్న చోట టిక్ పెట్టింది. అయితే అధికారుల పరిశీలనలో ప్రితికా హిజ్రాగా తేలింది. దాంతో ఆమె పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవాలని చూశారు. కానీ కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుని ఎట్టకేలకు ఆమె పరీక్ష రాసింది. అంతేగాక ఫిజికల్ ఇతర అన్ని రకాల పరీక్షల్లోనూ ప్రితికా పాస్ అయి సబ్ ఇన్ స్పెక్టర్ అయ్యేందుకు అర్హత సాధించింది. అయినా ఆమెకు పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. హిజ్రా అన్న ఒక్క కారణంతోనే నిరాకరించారు. ఏమాత్రం నిరాశచెందని ప్రితికా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ పుష్పా సత్యనారాయణన్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ పరిగణనలోకి తీసుకుని పిటిషన్ పై విచారణ చేపట్టింది. హిజ్రాలకే ప్రితికా ఆదర్శంగా నిలుస్తున్నారని, రాత, ఫిజికల్ తదితర పరీక్షల్లో అర్హత సాధించిన ఆమెకు సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుకు సంబంధించి నియామక ఉత్తర్వులను తక్షణమే జారీ చేయాలని బెంచ్ ఆదేశించింది. ఇదే సమయంలో మూడో కేటగిరీలో ఉన్న హిజ్రాలకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులో ఉద్యోగాల కల్పనకు సంబంధించి విధి విధానాలను రూపొందించి అమలు చేయాలని సూచించింది. ఈ ఆదేశంతో తమిళనాడు పోలీస్ శాఖలో ప్రితికా యాస్ని ఎస్సైగా బాధ్యతలు చేపట్టే తొలి హిజ్రాగా జాబితాలోకి ఎక్కబోతోంది.

  • Loading...

More Telugu News