: ఇంకోసారి చూసుకుంటా... అమెరికన్ డిస్ట్రాయర్ తో చైనా యుద్ధ నౌక


అది అత్యాధునిక అమెరికన్ డిస్ట్రాయర్ వార్ షిప్. పేరు యూఎస్ఎస్ థియోడర్ రోజ్ వెల్ట్. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో తిరుగుతూ, ఆ దేశం నిర్మించిన కృత్రిమ దీవి సమీపంలోకి వచ్చి, చైనా సముద్ర జలాల్లో 12 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. ఈ షిప్ కదలికలను మొదటి నుంచి గమనిస్తూ వచ్చిన చైనా యుద్ధనౌక ఒకటి దాని వెంటపడింది. దానితో యుద్ధం చేసింది. ఆయుధాలతో కాదండోయ్... మాటలతో. "హే, మీరు చైనా జలాల్లో ఉన్నారు. మీ ఉద్దేశమేంటి?" అని తొలుత ప్రశ్నించింది. తొలుత సమాధానం రాలేదు. పదేపదే ప్రశ్నా సంకేతాలు పంపడంతో అమెరికన్ షిప్ నుంచి సమాధానం వచ్చింది. "మేము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే, మా షిప్ నడుపుకుంటున్నాం. ఇక్కడి దీవిని దాటి ముందుకు వెళ్లడమే మా ఉద్దేశం" అని సమాధానం ఇచ్చారు. ఈ ప్రాంతంలో చైనా కావాలనే అశాంతిని రేపుతోందని ఆరోపిస్తున్న అమెరికా, ఇటీవలే దక్షిణ చైనా సముద్రంలో విన్యాసాలు కూడా చేసింది. ఈ షిప్ ను యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీ ఆష్ కార్టర్ సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలో సముద్ర మార్గాల్లో జరిగే వాణిజ్యంలో దాదాపు 5 లక్షల కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం చైనా సముద్రం మీదుగా సాగుతుంది. వియత్నాం, మలేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్, తైవాన్ తదితర దేశాల పరిధిలోని సముద్రమూ తమదేనని వాదిస్తోంది. తమ జలాల్లోకి నిత్యమూ అమెరికన్ నౌకలు వస్తున్నాయని ఆరోపిస్తోంది. దక్షిణ చైనా సముద్రం పరిధిలో కనీసం డజనుకు పైగా యుద్ధ నౌకలు, గస్తీ నౌకలను చైనా నియమించింది. ఇదిలావుండగా, చైనా, అమెరికా నౌకల మాటల వివరాలకు వస్తే, "ఇవాళ శనివారం కదా? మీరిక్కడేం చేస్తున్నారు" అని అక్టోబర్ 27 నుంచి అమెరికా యుద్ధ నౌకను ఫాలో అవుతూ వస్తున్న చైనా నౌక నుంచి ప్రశ్న వచ్చింది. ఆపై రెండు నౌకల మధ్యా కుశల ప్రశ్నలు కూడా వచ్చాయి. మీరేం తింటారు? ఎక్కడ ఉంటారు? వంటి ప్రశ్నలు, సమాధానాలు, హాలోవీన్ జరుపుకునే విధానం వంటివి చర్చకు వచ్చాయి. చివరిగా, ఆ నౌక చైనా జలాలను దాటిపోతున్న వేళ 'ఇంకోసారి నిన్ను చూస్తా'నంటూ చైనా షిప్ చెప్పింది. ఈ మొత్తం ఉదంతంపై వార్తా సేకరణకు అమెరికన్ షిప్ ఎక్కిన రాయిటర్స్ ప్రతినిధి ప్రత్యేక కథనాన్ని రాశారు.

  • Loading...

More Telugu News