: మాఫియా డాన్ కు రాయల్ ట్రీట్ మెంట్!... చోటా రాజన్ కు అన్నీ ‘ప్రత్యేక’మే!


రాజేంద్ర సదాశివ నికల్జే అలియాస్ చోటా రాజన్... 20 ఏళ్లకు పైగా భారత దేశ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు భారత పోలీసులు, సీబీఐ అధికారులు చేయని ప్రయత్నం లేదు. బలవంతపు వసూళ్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హత్య, హత్యాయత్నం తదితర ఆరోపణలకు సంబంధించి దేశ వాణిజ్య నగరం ముంబైలోనే అతడిపై 75 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలోనూ అతడిపై 10 కేసులు ఉన్నాయి. వెరసి అతడు కరుడుగట్టిన నేరగాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో తొలుత నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన అతడు, ఆ తర్వాత దావూద్ తో విభేదించి ఏకంగా సొంతంగా గ్రూపునే ఏర్పాటు చేసుకున్నాడు. మాఫియా డాన్ గా ఎదిగాడు. భారత్ సహా పలు దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించాడు. వేలాది కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. భారత్ కు మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగానూ అతడు రికార్డులకెక్కాడు. 20 ఏళ్ల సుదీర్ఘ వేట నేపథ్యంలో ఇటీవల ఇంటర్ పోల్ సహకారంతో ఇండోనేసియా పోలీసులు బాలి ఎయిర్ పోర్టులో అతడిని అరెస్ట్ చేశారు. అప్పటిదాకా తన సొంత డెన్ లలో సకల భోగాలు అనుభవించిన చోటా రాజన్, ప్రస్తుతం పోలీసుల అదుపులోనూ రాయల్ ట్రీట్ మెంట్ అందుకుంటున్నాడు. అరెస్టైన నాటి నుంచి అతడిని బాలి పోలీసులు కంటికి రెప్పలా కాపాడారు. అత్యాధునిక ఆయుధాలు చేతబట్టిన సాయుధ పోలీసులు అతడికి రాత్రింబవళ్లు భద్రత కల్పించారు. ఇక అతడిని భారత్ కు తీసుకొచ్చేందుకు సీబీఐ అధికారులు ఏకంగా ప్రత్యేక విమానాన్నే ఏర్పాటు చేశారు. ఈ తరహాలో కరుడుగట్టిన నేరస్తుడిని తీసుకొచ్చేందుకు సీబీఐ ఇప్పటిదాకా ప్రత్యేక విమానాన్ని వినియోగించిన దాఖలా లేదు. దావూద్ నుంచి ప్రాణహాని ఉందని చోటా రాజన్ చెప్పిన నేపథ్యంలోనే అతడిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని వినియోగించినట్లు సమాచారం. ఇక దేశానికి తీసుకొచ్చిన అతడిని వాస్తవంగా ముంబై తరలించాలి. అయితే దావూద్ నుంచి ముప్పు పొంచి ఉందని, ముంబై పోలీసు విభాగంలో దావూద్ అనుచరులున్నారని చోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాక తనను ముంబైకి కాకుండా, ఢిల్లీకి తరలించాలని కోరాడు. అతడు కోరిన వెంటనే సీబీఐ అధికారులు ఒప్పేసుకున్నారు. ఇక బాలి నుంచి భారత్ కు తరలించే సమయంలో అతడిని బాలి జైలు నుంచి ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చే క్రమంలో బుల్లెట్ ఫ్రూప్ కారును ఏర్పాటు చేశారు. సాయుధ బలగాలు తోడు రాగా అతడు వీఐపీ తరహాలోనే విమానమెక్కాడు. ఢిల్లీలో విమానం దిగీదిగగానే మళ్లీ సాయుధ బలగాలతో అతడికి రక్షణ కవచం రెడీ అయిపోయింది. ప్రత్యేక కాన్వాయ్ లో అతడిని సీబీఐ అధికారులు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ కూడా అతడికి మంచి ట్రీట్ మెంటే లభిస్తోంది. అతనిని ఉంచిన పరిసరాల్లోకి ఏ ఒక్కరిని అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రంగంలోకి దించారు. వెరసి కరుడుగట్టిన నేరగాడికి సీబీఐ అధికారులు అన్నీ ‘ప్రత్యేక’ వసతులనే కల్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News