: సహనశీలతపై కాంగ్రెస్, వామపక్షాలు గగ్గోలుపెట్టడం విడ్డూరం: వెంకయ్యనాయుడు
సహనశీలతపై కాంగ్రెస్, వామపక్షాలు గగ్గోలు పెట్టడం ఎంతో విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ఎక్కడో ఒకటి రెండు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనల కారణంగా సహనశీలత లేదనడం సబబు కాదని, అందువల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని అన్నారు. ‘నిజం తెలుసుకో’ అనే పుస్తకాన్ని మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ‘దేశాన్ని అరవైఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ తాము చెప్పిందే వేదమంటోంది. రెండో వైపు అభిప్రాయాలను చూసి ఆ పార్టీ సహించలేకపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. అందుకే ఇటువంటి ఆందోళనలకు పూనుకుంటున్నాయి. సహనశీలతపై దేశ వ్యాప్త చర్చ జరగాలి’ అని ఆయన అన్నారు.