: మోదీకి గురువు మారారు... గురువును బట్టే శిష్యుడు!: లాలూ
నరేంద్ర మోదీ తాను దేశానికి ప్రధానిని అని ఎక్కడా చెప్పుకోవడం లేదని, తాను సంఘ్ పరివార్ కు చెందిన వాడినని చెప్పుకుంటున్నారని, అందుకే దేశంలోని ఇతర మతాల వ్యక్తులపై దాడులకు పురికొల్పుతున్నారని జేడీయూ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ వాస్తవాలు కాదని అన్నారు. వాటిని నమ్మాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. బీహార్ లో బీజేపీ, దాని మిత్రపక్షాలకు 40 సీట్లు వస్తే గొప్పేనని చెప్పారు. మహాకూటమి 190 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. కొన్ని జిల్లాలకు జిల్లాల ఓటర్లు మహాకూటమికి ఓట్లేశారని ఆయన చెప్పారు. గతంలో మోదీ గురువు రాజ్ నాథ్ సింగ్ అని, ఆయన దిశానిర్దేశంలో బీజేపీ దేశంలో విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు మోదీ గురువు మారారని, ఆ స్థానంలోకి అమిత్ షా వచ్చారని, గురువును బట్టే శిష్యుడు కూడా ఉంటాడని ఆయన తెలిపారు. గతంలో మంచి గురువు మోదీకి దిశానిర్దేశం చేశారని, ఇప్పుడు గురువు గురించి అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ లో అగ్రవర్ణాలు, బడుగు, బలహీన వర్గాలన్నీ మహాకూటమి వెనుకే ఉన్నాయని ఆయన తెలిపారు.