: తొలి రోజు విజేతలు సఫారీలే!
మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో భాగంగా మొహాలీలో నేడు ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఆటలో సఫారీలు పైచేయి సాధించారు. ఆరేళ్ల తరువాత సొంత గడ్డపై టీమిండియాను తొలిరోజే ఆలౌట్ చేసిన జట్టుగా కీర్తిగడించారు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మెన్ ను సఫారీ బౌలర్లు ఏ దశలోనూ కుదురుకోనివ్వలేదు. నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా టాపార్డర్ పని పట్టారు. మురళీ విజయ్, రవీంద్ర జడేజా కాస్త ప్రతిఘటించినప్పటికీ ఎదురుదాడికి దిగలేకపోయారు. దీంతో భారత బ్యాట్స్ మన్ మురళీ విజయ్ (75), శిఖర్ ధావన్ (0), ఛటేశ్వర్ పుజారా (31), విరాట్ కోహ్లీ (1), అజింక్యా రహనే (15), వృద్ధిమాన్ సాహా (0), రవీంద్ర జడేజా (38), అమిత్ మిశ్రా (6), రవిచంద్రన్ అశ్విన్ (20), ఉమేష్ యాదవ్ (5), వరుణ్ ఆరోన్ (0) కలసి కేవలం 201 పరుగులే చేయగలిగారు. తొలి రోజు నుంచే పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని అంచనా వేసినప్పటికీ పేస్ బౌలర్లు సత్తాచాటడం విశేషం. స్టెయిన్ ను జాగ్రత్తగా ఆడిన బ్యాట్స్ మన్ అతనికి వికెట్ సమర్పించకపోవడం విశేషం. సఫారీ కొత్త బౌలర్ ఎల్గర్ నాలుగు వికెట్లు తీసి సత్తాచాటగా, ఫిలాండర్, తాహిర్ చెరి రెండు వికెట్లతో రాణించారు. వారికి హర్మర్, రబడా చెరో వికెట్ తో సహకరించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో వాన్ జిల్ (5), డుప్లెసిస్ (0) వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. క్రీజులో ఎల్గర్ (13), కెప్టెన్ హషీమ్ ఆమ్లా (9) ఉన్నారు. భారత్ స్కోరు దాటేందుకు సౌతాఫ్రికా 173 పరుగులు చేయాల్సిఉంది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో వికెట్ తీశారు.