: భయపెట్టిన యూఎస్ ఫెడ్, కనిపించని కొనుగోలు మద్దతు... నష్టాల్లో మార్కెట్లు!


అమెరికాలో వడ్డీ రేట్లను పెంచవచ్చని ఫెడరల్ రిజర్వ్ అధికారులు ఇచ్చిన సంకేతాలకు తోడు, బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచనలు ఇన్వెస్టర్లను నూతనంగా ఈక్విటీల కొనుగోళ్లకు దూరం చేశాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్ ఒక శాతం వరకూ నష్టపోగా, నిఫ్టీ కీలకమైన 8 వేల పాయింట్ల కన్నా కిందకు జారింది. డిసెంబరులో జరిగే ఫెడ్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న సంకేతాలు వెలువడటంతో ప్రపంచ మార్కెట్లన్నింటిపైనా ప్రభావం కనిపించింది. పలు ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నాటి సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 248.72 పాయింట్లు పడిపోయి 0.94 శాతం నష్టంతో 26,304.20 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 84.75 పాయింట్లు పడిపోయి 1.05 శాతం నష్టంతో 7,955.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.47 శాతం, స్మాల్ క్యాప్ 1.59 శాతం పడిపోయాయి. ఎన్ఎస్ఈ-50లో కేవలం 9 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, హీరో మోటో, ఆసియన్ పెయింట్స్, బీపీసీఎల్ తదితర కంపెనీలు 0.2 నుంచి 1.5 శాతం లాభపడగా, సన్ ఫార్మా, వీఈడీఎల్, టాటా స్టీల్, బీహెచ్ఈఎల్, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు 3.5 నుంచి 5 శాతం వరకూ నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,38,606 కోట్లకు పడిపోయింది. మొత్తం 2,815 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 900 కంపెనీలు లాభాలను, 1,798 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

  • Loading...

More Telugu News