: యుద్ధం ముగిసింది...ఫలితంతో ప్రభావితమయ్యేదెవరు?


బీహార్ లో ఎన్నికల యుద్ధం ముగిసింది. బీహార్ లో ఎలాగైనా విజయం సాధించాలని మహాకూటమి, ఎన్డీయే కూటమి శాయశక్తులా కృషిచేశాయి. నెల రోజులపాటు బీహార్ లో పట్టుకోసం కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టు తిరిగారు. ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతి విమర్శలతో నేతలు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కొన్ని సార్లు హద్దులు మీరినా పార్టీ మైలేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేశారు. వ్యూహాత్మకంగా బీజేపీ కొన్ని వీడియోలు విడుదల చేస్తూ విమర్శల పదును పెంచగా, దానికి దీటుగా డీఎన్ఏ ఉద్యమం చేపట్టారు నితీష్. లాలూ విమర్శలకు పురాణాల్లోని రాక్షసులంతా మరోసారి గుర్తుకొచ్చారు. రెండు కూటములకు మద్దతు పలకని సమాజ్ వాదీ పార్టీ తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ సాగింది. ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన ఎంఐఎం దూకుడుగా ప్రచారం సాగించింది. బీహార్ కు బీజేపీ, నితీష్ ఇద్దరూ సరైన నేతలు కాదని పేర్కొంటూ ప్రచారం చేసింది. అధికార పీఠమే లక్ష్యంగా అన్ని పార్టీలు తమదైనశైలిలో ప్రజల్లోకి వెళ్లాయి. నేడు జరిగిన చివరి దశ పోలింగ్ తో నేతల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లోకి చేరింది. బీహార్ లో విజయం సాధించడం బీజేపీకి అవసరం. ఇక్కడ విజయం సాధిస్తే రాజ్యసభలో బీజేపీకి బలం పెరుగుతుంది. దేశంలో బీజేపీ మరింత బలోపేతమవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ వ్యతిరేకతే తమను పీఠమెక్కించలేదని, తమ సామర్థ్యంతోనే అధికారం చేజిక్కించుకున్నామని బీజేపీ చేస్తున్న వాదనకు బలం చేకూరుతుంది. అలాగే వచ్చే ఏడాది చివర్లో దక్షిణాది, తూర్పు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి సోపానం అవుతుంది. ఓటమిపాలైతే మాత్రం బీజేపీకి గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉంది. రాజ్యసభలో బలం పెరగకపోగా, మోదీ నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భవిష్యత్ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రాభవానికి గండిపడే ప్రమాదం ఉంది. అదే సమయంలో మోదీ, అమిత్ షా జోడీ నాయకత్వ లక్షణాలపై చర్చకు తావిచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నితీష్ కుమార్, లాలూల మహాకూటమి విజయం సాధిస్తే బీహార్ లో నితీష్ కు తిరుగులేదనే వాదన బలపడుతుంది. బీహారీలలో మార్పు రాలేదని, నితీష్ పాలన బీహారీలను ఆకట్టుకుందనే వాదన బలపడుతుంది. నితీష్ ప్రతిష్ఠ పెరుగుతుంది. లాలూకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మరోసారి బలం పుంజుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. బీజేపీ తీసుకునే కీలక నిర్ణయాలను పార్లమెంటులో ప్రశ్నించే అవకాశం కలుగుతుంది.

  • Loading...

More Telugu News