: పాకిస్థాన్ చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం
ఇంగ్లండ్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు ఘోరంగా విఫలమైంది. దీంతో మ్యాచ్ తో పాటు టెస్టు సిరీస్ ను కూడా కోల్పోయింది. పాకిస్థాన్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును డ్రాగా ముగించిన ఇంగ్లండ్, రెండో టెస్టులో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ జట్టు 234 పరుగులు మాత్రమే చేయగా, ఇంగ్లండ్ 306 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 355 పరుగులు చేసింది. 283 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఎవరూ ఊహించని విధంగా 155 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (63) మినహా ఇతర ఆటగాళ్లెవరూ రెండంకెల స్కోరు చేయకపోవడం విశేషం. వారిలో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ గా పెవిలియన్ చేరారు. పాకిస్థాన్ బౌలర్లు యాసిర్ షా (4), షోయబ్ మాలిక్ (3), జుల్ఫికర్ బాబర్ (2), రహత్ అలీ (1) విరుచుకుపడడంతో ఇంగ్లండ్ 128 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టెస్టు సిరీస్ ను పాక్ గెలుచుకుంది.