: గల్ఫ్ బాధిత కుటుంబాలతో కలసి రేపు ఢిల్లీకి కేటీఆర్
టీఎస్ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీ వెళుతున్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలతో కలసి వెళ్తున్న ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు. అక్కడ ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి కేంద్రం తరపున సహాయ సహకారాలు అందించాలని విన్నవించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా ఎంతో మంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోయి, అక్కడకు చేరుకున్న తర్వాత సమస్యలను ఎదుర్కొంటున్న వారు కొందరైతే, తాము పని చేస్తున్న దగ్గర యజమానుల చేతిలో నరకాన్ని చవిచూస్తున్న అభాగ్యులు మరికొందరు. అక్కడే ఉండలేక, మన దేశానికి వచ్చే దారి కనపడక వేలాది మంది తెలుగువారు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే, గల్ఫ్ బాధిత కుటుంబాలతో కలసి కేటీఆర్ ఢిల్లీ వెళుతున్నారు.