: కరికులమ్ ను అప్ డేట్ చేసుకోవడంలో మనమే 'బద్దకిస్టులం' అట!
ఇండియాలోని యూనివర్శిటీలు, ఉన్నత విద్యను అందిస్తున్న విద్యాలయాలు తాము ఏం బోధిస్తున్నామన్న విషయాన్ని వెల్లడించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయని ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న సీఎన్ఆర్ రావు వ్యాఖ్యానించారు. అందువల్లే భారత వర్శిటీలు ప్రపంచంలోనే టాప్ గా నిలవడంలో విఫలమవుతున్నాయని ఆయన అన్నారు. "90 శాతం యూనివర్శిటీలు నిధుల పెరుగుదల, మౌలిక వసతులు తదితరాల గురించి నిత్యమూ మాట్లాడుతుంటాయి. కానీ, వారు ఏం బోధిస్తున్నారన్న విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడంలో విఫలం అవుతున్నాయి" అని అన్నారు. రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన తన మదిలోని అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. నిరుద్యోగులు, ప్రమోషన్లు కోరుకునే భారత యువత సైతం ఇదే దారిలో వెళుతోందని, ఎంతో మంది ఎప్పటికప్పుడు తమ కరికులమ్ ను వాస్తవ పరిస్థితి, అనుభవానికి తగ్గట్టుగా మార్చుకోవడం లేదని, దీని కారణంగా మెరుగైన ఉద్యోగాలకు దూరమవుతున్నారని అన్నారు. న్యూటన్, ఫరాడేల గురించి విద్యార్థులకు చెబుతున్న విద్యా సంస్థలు, విద్యార్థుల్లో అంతర్గతంగా దాగున్న అంతే గొప్ప నైపుణ్యాన్ని వెలికి తీయడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు.