: వడ్డీ తక్కువని బాధ వద్దు... మెచ్యూరిటీ తరువాత మీరు ఆశ్చర్యపోతారు: మోదీ
బంగారం డిపాజిట్లపై ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న వడ్డీ తక్కువగా ఉందని ఎవరూ బాధపడరాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉదయం గోల్డ్ మానిటైజేషన్ స్కీమును ప్రకటించిన ఆయన, డిపాజిట్లపై 2.25 శాతం నుంచి 2.75 శాతం వడ్డీని ఇవ్వనున్నట్టు తెలిపారు. డిపాజిట్లకు 8 సంవత్సరాల కాలపరిమితి అమలవుతుందని, ఐదేళ్ల తరువాత ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుబడిని వడ్డీ సహా వెనక్కు తీసుకోవచ్చని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పది గ్రాముల బంగారం ధర ఎంతగా పెరుగుతుందో తాను సైతం ఊహించలేకపోతున్నానని, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని వివరించారు. ఆ పాటికి ప్రజలు పెట్టే డిపాజిట్లపై వడ్డీ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుందని, సాధారణ సేవింగ్స్, ఫిక్సెడ్ డిపాజిట్లతో పోలిస్తే అధిక వడ్డీ వస్తుందన్న నమ్మకముందని అన్నారు. బ్యాంకులు ఇచ్చే వడ్డీని బంగారం రూపంలోనే తీసుకుంటామని ముందుగానే బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోవాలని సలహా ఇచ్చారు. మెచ్యూరిటీ తరువాత, ఇప్పటి బంగారం ధరతో పోలిస్తే, ఆశ్చర్యపోయే మొత్తం లభిస్తుందని మోదీ తెలిపారు.