: వెంకన్న దర్శనానికి వచ్చిన కుటుంబానికి తీరని శోకం!
తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. అధికారుల నిర్లక్ష్యం ఓ చిరు ప్రాణాన్ని బలితీసుకుంది. విద్యుత్ షాక్ కు ముంబై బాలుడు మరణించగా, మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో మరిన్ని వివరాల్లోకి వెళితే, తిరుపతి బస్టాండ్ పక్కనే ఉన్న యాత్రికుల వసతి సముదాయం 'శ్రీనివాసం' వద్దకు ముంబైకి చెందిన మురుగన్, ఆయన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా, వారి పిల్లలు బయట ఆడుకుంటున్నారు. శ్రీనివాసం ఆవరణలో ఉన్న కరంటు స్తంభాలపై నుంచి విద్యుత్ ప్రవహిస్తున్న తీగలు వేళ్లాడుతున్నాయి. వీటిని గమనించని పిల్లలు వాటిని తగిలారు. దీంతో వారికి షాక్ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై యాత్రికులు మండిపడుతున్నారు.