: ఓరుగల్లు వాసుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం... సిరిసిల్ల రాజయ్యపై దాడికి యత్నం


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంటిలో నిన్న తెల్లవారుజామున చోటుచేసుకున్న ప్రమాదం వరంగల్ లోనే కాక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విషాదం నింపింది. రాజయ్య ఇంటిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారికతో పాటు ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గదిలో ఎగసిపడ్డ మంటల్లో వారు నలుగురు మాంసం ముద్దల్లా మిగిలిపోయారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నిమిషాల్లో వరంగల్ వ్యాప్తంగా పాకిపోయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు ధర్నాకూ దిగాయి. సారికతో పాటు చిన్నారులను కడసారి చూద్దామని పెద్ద సంఖ్యలో నగరవాసులు సాయంత్రం దాకా అక్కడే వేచి ఉన్నారు. అయితే సాయంత్రం మాంసం ముద్దల్లా మారిన ఆ నలుగురి శవాలను చూసి వారు తట్టుకోలేకపోయారు. అప్పటికే పోలీసుల అదుపులోకి వెళ్లి, పోలీస్ జీపులో కూర్చున్న సిరిసిల్ల రాజయ్యపై దాడికి యత్నించారు. పోలీసు జీపు వైపు దూసుకెళ్లిన ప్రజలు రాజయ్యపై దాడి చేసేవారే. అయితే అప్పటికే పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి, రాజయ్య కూర్చున్న జీపును వేగంగా ముందుకు కదిలించారు. దీంతో రాజయ్య వరంగల్ జనాల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

  • Loading...

More Telugu News