: సెల్ ఫోన్ దొంగకు చుక్కలు చూపిన సెరెనా... వెంటబడి పట్టుకున్న టెన్నిస్ స్టార్
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆడుతోందంటే ఆ ప్రాంతమంతా కేరింతలతో హోరెత్తిపోవాల్సిందే. టెన్నిస్ రాకెట్ తో బంతిని కొట్టినప్పుడల్లా సెరెనా పెట్టే కేకలతో స్టేడియం హోరెత్తిపోతుంది. ఆట, అరుపుల్లోనే కాదండోయ్.., పరుగులోనూ సెరెనా సూపర్ స్టారే. తన సెల్ ఫోన్ ను చోరీ చేసి పరుగు లంఘించుకున్న ఓ దొంగకు ఆమె షాకిచ్చింది. తన సోదరి వీనస్ విలియమ్స్, మరో టెన్నిస్ స్టార్ కరోలినా వోజ్నియాకిలతో కలిసి సెరెనా నిన్న ఓ చైనీస్ రెస్టారెంట్ కు వెళ్లింది. బిజీగా ఉండే సదరు రెస్టారెంట్ లో ఓ టేబుల్ ముందు కూర్చున్న సెరెనా, తన మొబైల్ ఫోన్ ను మరో కుర్చీలో పెట్టింది. దీనిని గమనించిన ఓ దొంగ చిన్నగా వచ్చి ఆమె పక్కన నిలబడ్డట్టే నిలబడి, ఉన్నట్టుండి సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యాడు. అయితే సెకన్ల వ్యవధిలో రియాక్ట్ అయిన సెరెనా, కుర్చీలో నుంచి శివంగిలా దూకింది. కళ్లు మూసి తెరిచేలోగా దొంగ ముందు నిలబడింది. ఊహించని విధంగా తన ముందు నిలబడ్డ సెరెనాను చూసి షాక్ తిన్న సదరు దొంగ సెల్ ఫోన్ ను తిరిగిచ్చేసి తుర్రుమన్నాడు. సెల్ ఫోన్ ను దొంగ నుంచి తీసుకుని తిరిగి రెస్టారెంట్ కు వచ్చిన సెరెనాకు అక్కడ కూర్చున్న వారంతా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. నిన్న జరిగిన ఈ ఘటనను కళ్లకు కట్టేలా రాసిన సెరెనా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ‘ఇన్ స్టాగ్రాం’, ‘ఫేస్ బుక్’లలో పోస్ట్ చేసింది.