: కిడ్నీ మార్పిడి కోసమే ఛోటా రాజన్ భారత్ కు తిరిగొస్తున్నాడు: ముంబై క్రైమ్ బ్రాంచ్
గత కొంత కాలంగా భారత పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ బాలిలో పట్టుబడటంపై పలు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో వాదన బయటికొచ్చింది. 55 ఏళ్ల రాజన్ అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ లో మార్పిడి చేయించుకోవాలని ఏడాదికాలంగా అతను ప్లాన్ వేస్తున్నాడని, భారత్ లో అతనికి కిడ్నీ ఇచ్చేందుకు కుటుంబసభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు. రాజన్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో ప్రస్తుతం ఆయన డయాలసిస్ చేయించుకుంటూ జీవిస్తున్నారని ఆ అధికారి చెప్పారు. అతను బతకాలంటే కొత్తగా కిడ్నీ మార్పించుకోవడం చాలా అవసరమన్నారు. కానీ పరారీ ఖైదీగా ఉన్న రాజన్ విదేశాల్లో ఆపరేషన్ చేయించుకోవడం వీలుపడదని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ తిరిగొస్తే తప్పకుండా తన కిడ్నీ మార్పిడికి అధికారులు అనుమతించే అవకాశం ఉందని రాజన్ భావిస్తున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. మరోవైపు రాజన్ ఆరోగ్య పరిస్థితి తెలిసి మేనల్లుడు ఒకరు కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారని సమాచారం. ఈ మేరకు తన వైద్య పరీక్షల వివరాలను కుటుంబసభ్యులకు మెయిల్ లో పంపగా... వాటిని దక్షిణ ముంబైలోని ఓ ప్రముఖ నెఫ్రాలజిస్టుకు చూపించారు. దాంతో వారిద్దరి కిడ్నీలు మ్యాచ్ అవుతాయని, రాజన్ కు మేనల్లుడు కిడ్నీ ఇవ్వొచ్చని వైద్యుడు సలహా ఇచ్చారని తెలిసింది. ఇందుకోసం సుదీర్ఘ కాలం నుంచి ప్రణాళిక వేసినట్టు చెబుతున్నారు.