: నిక్కర్ల స్థానంలో ఇక ప్యాంట్లు...మారనున్న 'స్వయం సేవకుల' డ్రెస్ కోడ్


'స్వయం సేవకులు'గా మనం పిలుచుకుంటున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్తల డ్రెస్ కోడ్ గుర్తుందిగా? తెల్లటి చొక్కా, ఖాకీ నిక్కర్లు, తలపై టోపీ, చేతిలో కర్రతో వారు చేసే కవాతు మనందరికీ చిరపరచితమే. చిన్న స్థాయి కార్యకర్త నుంచి సంస్థ చీఫ్ మోహన్ భగవత్ దాకా ఇదే డ్రెస్ కోడ్ అమలవుతోంది. బీజేపీ కురువృద్ధులు సైతం ఆరెస్సెస్ సమావేశాలకు వెళ్లినా, ఇదే డ్రెస్ కోడ్ లో దర్శనమివ్వడం మనకు తెలిసిందే. అయితే స్వయం సేవకులను ఇకపై మనం నిక్కర్లలో చూడలేం. ఎందుకంటే నిక్కర్ల స్థానాన్ని ఫుల్ ప్యాంట్లు రిప్లేస్ చేయనున్నాయి. ఈ మేరకు గత వారం రాంచీలో జరిగిన ఆరెస్సెస్ సమావేశాల్లో సంస్థ అగ్ర నేతలు నిర్ణయం తీసుకున్నారట. అంతేకాక కొంతమంది కార్యకర్తలకు ప్యాంట్లు వేసి మరీ కవాతు చేసి పరిశీలించారట. ప్యాంట్లతో కవాతు చేయడం బాగానే ఉందని కూడా ఆ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారని వినికిడి. అయితే ఈ డ్రెస్ కోడ్ మారడానికి మరో నాలుగు నెలల సమయం పట్టనుంది. ఎందుకంటే సంస్థకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ‘అఖిల భారతీయ పరిణతి సభ’కే ఉంది. సదరు విభాగం తదుపరి సమావేశం వచ్చే మార్చిలో జరగనుంది. ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత స్వయం సేవకులు నిండుగా ప్యాంట్లు ధరించి కవాతు చేస్తారట. అయితే ప్యాంట్లు కూడా ఖాకీ రంగులోనే ఉంటాయట.

  • Loading...

More Telugu News