: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం రాహుల్ తో మాట్లాడతాం: అరుణ్ జైట్లీ
కీలక వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించేందుకు ప్రతిపక్షాలను ఎలాగైనా ఒప్పిస్తామని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ కు సంబంధించిన ఏ నాయకులతోనైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పినట్టు బ్లూమ్ బర్గ్ న్యూస్ తెలిపింది. అయితే రాహుల్ గాంధీతో కూడా మాట్లాడతారా? అని ప్రశ్నించగా 'తప్పకుండా' అని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో మత అసహనం పెరిగిపోతోందని ఇటీవల కేంద్రంపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు జీఎస్టీకి అంత తేలికగా అనుమతి తెలుపుతాయని అనిపించడంలేదు. మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్న ఈ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందాలి.