: ‘సిరిసిల్ల’ ఇంటి ముందు మహిళా సంఘాల ధర్నా... రాజయ్య కుటుంబం అరెస్టుకు డిమాండ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంటి ముందు మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. నేటి తెల్లవారుజామున రాజయ్య ఇంటిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవలు కాలి బూడిదయ్యారు. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి. మహిళా సంఘాలకు చెందిన పలువురు ప్రతినిధులు సిరిసిల్ల రాజయ్య ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఘటనకు కారకులుగా భావిస్తూ రాజయ్యతో పాటు ఆయన కుమారుడు అనిల్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వాస్తవాలను వెలికితీసిన తర్వాత కాని నిందితుల అరెస్ట్ కుదరదన్న రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ నేత అన్న కారణంగానే పోలీసులు రాజయ్య కుటుంబం పట్ల మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.