: నా వారసుడు స్టాలినే!... డీఎంకే అధినేత కరుణానిధి పరోక్ష ప్రకటన
తమిళ నాట ప్రధాన రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే)కి సుదీర్ఘ కాలంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ ఆయన పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. ఇక పార్టీ సారథ్య బాధ్యతలు మరొకరికి అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. మరి కరుణానిధి తర్వాత పార్టీ బాధ్యతలు ఎవరికి దక్కనున్నాయన్న అంశంపై ఇప్పుడే కాక గతంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపై పలుమార్లు మీడియా ముందు నోరు విప్పిన కరుణానిధి తన చిన్న కుమారుడు స్టాలిన్ అభ్యర్థిత్వానికే ఓటేశారు. ఈ క్రమంలో అలిగిన ఆయన పెద్ద కుమారుడు అళగిరి దాదాపుగా ఈ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా మరోమారు తన చిన్న కొడుకే పార్టీ అధినేతగా వ్యవహరించనున్నారన్న అర్థం వచ్చేలా కరుణానిధి పరోక్ష ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు స్టాలిన్ అన్ని రకాలుగా అర్హత సాధించాడని కరుణానిధి పేర్కొన్నారు. ‘‘డీఎంకే కేవలం ఒక్కరు పెట్టిన పార్టీ కాదు. పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య భావాలు, విలువలు కలబోసిన పార్టీ. ప్రజలు కోరినట్లుగానే పార్టీలో నిర్ణయాలు జరుగుతాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. పార్టీ సర్వసభ్య సమావేశం, కార్యవర్గం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని నేనొక్కడిని తీసుకోజాలను. నేను ప్రకటించకుండానే పార్టీ ప్రధాన బాధ్యతలకు తగిన వ్యక్తిగా స్టాలిన్ వెలుగొందుతున్న వాస్తవాన్ని పార్టీలోని ప్రతి ఒక్కరూ గుర్తించారు’’ అని కరుణానిధి అన్నారు.