: కొత్త అవతారం ఎత్తనున్న ఇంజమామ్ ఉల్ హక్
పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. కోచ్ గా క్రికెటర్ల నైపుణ్యానికి మెరుగులు దిద్దనున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ గా ఆయన ఎంపికయ్యాడు. రెండేళ్ల పాటు ప్రస్తుతానికి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ మాజీ కోచ్, పాకిస్థాన్ ప్రస్తుత సెలెక్టర్ కబీర్ ఖాన్ మీడియాకు వెల్లడించాడు. ప్రపంచం గర్వించదగ్గ క్రికెటర్లలో ఇంజమామ్ ఒకడని... అతని కోచింగ్ లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు మరింత మెరుగవుతాయనే ఆశాభావాన్ని కబీర్ వ్యక్తపరిచాడు. రెండేళ్ల క్రితమే పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గా ఇంజమామ్ కు అవకాశం వచ్చింది. అయితే, బోర్డుతో ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా ఇంజీ ఆ అవకాశాన్ని వద్దనుకున్నాడు. పాక్ తరపున ఇంజమామ్ 120 టెస్టులు, 388 వన్డేలు ఆడాడు.