: మనసు పాకిస్థాన్ లో, తనువు ఇండియాలో... షారూక్ పై బీజేపీ నేత
మత అసహనంపై షారూఖ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఎదురుదాడి మరింతగా పెరిగింది. తొలుత సాధ్వీ ప్రాచి షారూక్ ను తప్పుబట్టగా, తాజాగా బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా తీవ్ర విమర్శలు చేశారు. "షారూక్ ఖాన్ ఇండియాలో ఉంటాడు. ఆయన మనసు మాత్రం పాకిస్థాన్ లో ఉంటుంది. ఆయన సినిమాలు ఇక్కడ కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయి. అయినా, ఆయన భారత్ లో అసహనాన్ని వెతుకుతున్నారు" అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, కైలాష్ వ్యాఖ్యలపై మరో బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు షారూక్ కు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఓ బ్రియన్ తదితరులు ట్వీట్లు చేశారు.